అడుగుజాడల అన్వేషణ
ఆ అడుగుల వెంట పరుగులు పెట్టిన క్షణాలు...
ఆత్మీయమైన పలకరింపుతో పరవశించిన ఆ అమృతఘడియలు…
ఆ పాదాలను స్పృశించి పునీతులమైన పర్వదినాలు...
చిన్మయమైన చిరునవ్వుతో తన్మయమైన తరుణాలు…
అనుగ్రహం వర్షించే ఆ దర్శనాలు…
పరవశింపజేసే ఆ మధుర వీక్షణాలు…
ఇక గతమని…
మరి లేవని… ఇక రావని...
మనస్సును నమ్మించలేక, వాస్తవాన్ని అంగీకరించలేక…
హృదయం ఆర్ద్రమై, జీవం భారమై, జీవితం ప్రశ్నార్థకమై...
సమాధానం కోసం సాయినాథుని అర్థించి
సాయియే సర్వంగా సాగిన ఆయన జీవితప్రస్థానంలో
ఆయన పదముద్రల కోసం అన్వేషిస్తే…
‘అప్పుడు’ ‘ఇప్పుడు’ ‘అక్కడ’ ‘ఇక్కడ’ లకు ఎప్పుడో అతీతమైన “ఆయన”
అప్పుడెక్కడున్నారో ఇప్పుడూ అక్కడే ఉన్నారన్న
మన అనుభవాలే సమాధానాలయ్యాయి.
మరి దేశకాలపరిమితులకు అతీతమైన ఆయన
ఎక్కడున్నారు? ఎక్కడుంటారు?
“సాయిబాబా… సాయిబాబా…” అని ఎలుగెత్తి బాబాను పిలిచే వేళ మన పిలుపులో…
“సాయి” అన్న తరుగులేని ఆనందాన్ని తనివితీరా అనుభవించాలన్న మన తపనలో…
ప్రపంచం తలక్రిందులైనా సద్గురు పాదాల చెంత సడలని మన శరణాగతిలో…
“మేం బాబా బిడ్డలం” అన్న మన గుర్తింపులో ఉన్నారు.
ఏం తింటున్నా ఏం తాగుతున్నా బాబాను స్మరించే మన అర్పణలో…
బాబాను చూసిన ప్రతిసారి మన హృదయంలో కలిగే నమస్కారభావంలో…
సాయిదర్శానానికి వెళ్ళే వేళ మన మనస్సుదాల్చే మౌనంలో…
సాయినాథుని భజించే వేళ భావోద్వేగంతో స్పందించే మన హృదయనాదంలో ఉన్నారు.
బాబా సేవకు ఉవ్వెత్తున ఎగిసే మన ఉత్సాహంలో…
‘సాయి ప్రేమ’నే చిరుదివ్వెను పెనుజ్వాలగా మార్చుకోవాలన్న మన ఉత్తేజంలో…
బాబా పట్ల మనప్రేమ అనన్యంగా అనంతంగా పెరగాలన్న మన ఆర్తిలో…
బాబా ఇవ్వదలచింది పొందే వరకు విశ్రమించకూడదని రగలుతున్న మన స్ఫూర్తిలో ఉన్నారు.
పరనిందల తలపులు పలుకులుగా మారే క్షణాలలో అడ్డుపడే మన వివేకంలో…
ఈ పని బాబాకు దగ్గరచేస్తుంది ఈ పని బాబాకు దూరం చేస్తుందని హెచ్చరించే మన విచక్షణలో…
కులమతాల అడ్డుగోడలను తొలగించుకోవాలనే మన నిశ్చయంలో…
మూఢనమ్మకాలను వ్యర్థాచారాలను నిర్ద్వంద్వంగా తిరస్కరించే మన చైతన్యంలో ఉన్నారు.
సత్యాన్ని అంటుపెట్టికోవాలన్న మన సత్సంకల్పంలో…
దక్షిణలు విరాళాలు స్వీకరించని మన సత్సంగాల విశిష్టతలో…
నమ్మిన ఆదర్శాల కోసం ప్రపంచాన్ని లక్షించని మన ధైర్యంలో…
నిరాశల చీకట్లు ముసురుకున్నవేళ మన పెదాలపై మెరిసే చిరునవ్వులో ఉన్నారు.
ప్రారంభించిన పనిని చివరికంటా పూర్తిచేయాలన్న మన పట్టుదలలో…
సాయిభక్తులకు అసాధ్యం అంటూ లేదని అనుకున్న పని అంతు చూడాలన్న మన పంతంలో…
సర్వకాలసర్వావస్థలలో సాయినాథుని పట్ల అచంచలమైన మన ‘శ్రద్ధ’లో…
సద్గురు అనుగ్రహం కోసం యుగాల పర్యంతమైనా ఆనందంగా ఎదురుచూడగల మన ‘సబూరీ’లో ఉన్నారు.
చూడాలన్న అభిలాషే ఉంటే నిత్యం మన కళ్ళ ముందే ఉన్నారు
నేర్చుకోవాలనే జిజ్ఞాసే ఉంటే ప్రతిక్షణం నేర్పుతూనే ఉన్నారు
ఆయనను అన్వేషించాలన్న ఆకాంక్ష ఉంటే
ఆయనను అనుసరించాలన్న తపన ఉంటే
మనతోనే “ఉన్నారు”… మనలోనే “ఉన్నారు”… మనమై “ఉన్నారు”.
- Bheem Konduru